చిరంజీవి 'మెగా158' పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి

  • పొల్లాచ్చిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపిన దర్శకుడు బాబీ
  • ఈ చిత్రంలో మలయాళ నటి అనశ్వర రాజన్ కీలకపాత్ర
  • వాల్తేరు వీరయ్య తర్వాత చిరు-బాబీ కాంబోలో రెండో సినిమా
  • థమన్ సంగీతం, జైలర్ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ వర్క్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, యువ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం #Mega158. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా తమిళనాడులోని పొల్లాచ్చిలో చేపట్టిన కీలక షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ కొల్లి గురువారం తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.

"పొల్లాచ్చిలో #Mega158కు సంబంధించిన ఒక ఎలక్ట్రిఫైయింగ్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. కొన్ని అద్భుతమైన సన్నివేశాలు చాలా అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. మరిన్ని ఉత్తేజకరమైన అప్‌డేట్‌లు రాబోతున్నాయి" అని బాబీ తన పోస్టులో పేర్కొన్నారు. 

గత వారమే ప్రారంభమైన ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రధాన తారాగణం పాల్గొని కీలక సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమా ద్వారా మలయాళ యువ నటి అనశ్వర రాజన్ తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఇటీవల చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆమెను ప్రాజెక్టులోకి స్వాగతిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

బ్లాక్‌బస్టర్ హిట్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో #Mega158పై మెగా అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ‘జైలర్’, ‘డాకు మహరాజ్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ఆంటోనీ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

గతేడాది చిరంజీవి పుట్టినరోజున ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ పాత్ర కోసం మెగాస్టార్ ఎంతగా శ్రమిస్తున్నారో తెలియజేస్తూ ఇటీవల జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ‘పరిమితులను అధిగమించడానికి ప్రతిరోజూ ఒక కొత్త అవకాశం. #Mega158 కోసం నా ప్రియమైన బాబీతో మరో చిరస్మరణీయ ప్రయాణానికి సిద్ధమవుతున్నాను’ అని ఆ వీడియోకు క్యాప్షన్ జోడించారు. సినిమా ప్రకటన పోస్టర్‌లో గొడ్డలితో పగిలిన గోడ, రక్తపు మరకలతో పాటు ‘ది బ్లేడ్ దట్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్’ అనే ట్యాగ్‌లైన్ ఉండటం సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో సూచించింది. తదుపరి షెడ్యూల్, ఇతర నటీనటుల వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.

Chiranjeevi
Mega158
Bobby Kolli
KVN Productions
Pollachi schedule
Anaswara Rajan

More Telugu News